Thursday, January 19, 2012

కెప్టెన్ పొరపాట్ల వల్లే ప్రమాదం 

కోస్టా కోన్‌కార్డియో యాజమాన్యం 85 మిలియన్ల యుఎస్ డాలర్ల నష్టం 

         గిగ్లియో ఐలాండ్, జనవరి 16: ఇటలీ సమీపంలో సముద్రంలో ఒరిగిపోయిన లగ్జరీ నౌక కోస్టా కాన్‌కోర్డియా ప్రమాదానికి కారణం కెప్టెన్ అని షిప్ యజమాని విమర్శించాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. 4,200 మంది ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ నౌక దారితప్పి తీరానికి చేరువగా వచ్చేసింది. సముద్రం దిగువున నేలతగలడంతో బహుళ అంతస్తుల నౌక ఒక పక్కకు ఒరిగిపోయింది. లైఫ్‌జాకెట్లు ద్వారా ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతావారిని సహాయక బృందాలు బోట్లలో గిగ్లియో ద్వీపానికి సురక్షితంగా తరలించారు. సహాయ బృందాలు రేబంబవళ్లూ గాలించి ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. శుక్రవారం అర్థరాత్రి నౌక ప్రమాదానికి గురైంది. సుమారు 15 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని ఇటాలియన్ వార్త సంస్థ ‘అన్సా’ తెలిపింది. గల్లంతైన వారిలో ఇటాలియన్లు, అమెరికన్లు, ఫ్రెంచ్ జాతీయులున్నారు. కెప్టెన్ పొరపాట్ల వల్లే ప్రమాదం జరిగిందని కాన్‌కోర్డియా యజమాని ధ్వజమెత్తాడు. అత్యవసర సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు విస్మరించడం వల్లే ప్రమాదం సంభవించిందని ఆయన ఆరోపించాడు. కెప్టెన్ ఫ్రాన్సిస్కో స్కాట్టినోపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నాడు. కెప్టెన్‌ను శనివారమే అరెస్టు చేసినట్టు విచారణాధికారి ఫ్రాన్సిస్కో వెరూసియో తెలిపారు. తాము ఎన్ని జాగ్రత్తలు చేప్పినా కెప్టెన్ పెడచెవిన పెట్టాడని కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోస్టా కాన్‌కోర్డియా నిర్దేశించిన మ్యాప్ ప్రకారం వెళ్ళలేదని, కెప్టెన్ బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని వెరూసియో పేర్కొన్నారు. నౌక సిబ్బంది నిర్లక్ష్యాన్ని దర్యాప్తు అధికారులు తప్పుపడుతున్నారు. ప్రమాదం జరిగి గంట సేపయినా ప్రయాణికులను రక్షించే ఏర్పాట్లు చేయలేదన్నారు. 17 అంతస్తుల నౌకలోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్న సిబ్బందిలో చలనం లేదని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ పలువురు ఆరోపించారు. ఇలా ఉండగా ఈ ప్రమాదం వల్ల 85 నుంచి 95 మిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు ప్రాధమిక అంచనా. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, సిబ్బందిని కాపడడమే లక్ష్యంగా తాము పనిచేశామని కోస్టా కాన్‌కోర్డియో నౌక యాజమాన్యం కార్నివల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు సంస్థ ప్రగాఢ సంతాపం తెలిపింది.



0 comments:

Post a Comment