జపాన్ లో ప్రకృతి విలయం .....
పెను భూకంపం.. సునామీ బీభత్సం వందలాది మంది మృతి
రిక్టర్ స్కేలుపై 8.9పాయంట్లు నమోదు
ఫుకుషిమాలోని అణు విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ టవర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆ కేంద్రాన్ని మూసివేసారు. మరో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసివేసారు. అయితే ఈ కేంద్రాలనుంచి అణు ధార్మిక ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేసారు. భూకంపం తర్వాత టోక్యో సమీపంలోని ఒక చమురు రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 30 మీటర్ల ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉండడంతో అదుపు చేయడం అసాధ్యంగా మారింది. టోక్యో నగరంలో అనేక చోట్ల మంటలు చెలరేగడంతో నగరంలోని దాదాపు నలభై లక్షల గృహాలకు కరెంటు సరఫరా లేకుండా పోయింది. ఉత్తర జపాన్‌లోని ప్రధాన రహదారి అయిన తొహోకు ఎక్స్‌ప్రెస్ హైవే అనేక చోట్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఉత్తర ప్రాంతాలకు వెళ్లే బులెట్ ట్రైన్లను సైతం నిలిపివేసారు. దేశంలోని అన్ని ప్రధాన రేవుల్లోను కార్యకలాపాలను ఆపేసారు. టోక్యోలో భూగర్భ సబర్బన్ రైళ్లను ఆపేయడంతో వేలాది మంది ప్రయాణికులు మధ్యలో చిక్కుపడిపోయారు. సెండాయ్ విమానాశ్రయాన్ని సైతం కొద్ది గంటలు మూసివేసారు. అయితే సాయంత్రం తర్వాత బయటి ప్రాంతాలకు వెళ్లే విమానాలను అనుమతించారు.
‘పరస్పరం సాయం చేసుకోండి’
దేశాన్ని పెను భూకంపం, సునామీలు కుదిపేసిన నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైన రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జపాన్ ప్రధాని నవోటో కాన్ ఈ ప్రకృతి విలయం కారణంగా నష్టాన్ని వీలయినంతమేరకు తగ్గించడానికి పరస్పరం సహకరించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ భూకంపం ఉత్తర జపాన్‌లో విస్తృత ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని కలుగజేసినట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. కనీవినీ ఎరుగని ఈ విపత్తును ఎదుర్కోవడానికి వీలుగా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి ఈ విపత్తును ఎదుర్కోవడానికి కృషి చేస్తుందని ప్రధాని చెప్పారు. దేశ ప్రజలు సైతం తమ కుటుంబంలోవారికి పరస్పరం సహాయపడ్డంతో పాటు పొరుగువారికి కూడా సాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక భూకంపం తర్వాత మరి కొద్ది రోజుల దాకా ప్రకంపనలు సంభవించే ప్రమాదం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరారు.
భూకంపం తర్వాత ఇప్పటివరకు 2100 కిలోమీటర్ల పొడవున్న జపాన్ తీరం అంతటా అనేక సార్లు భూమి కంపించింది. కొన్ని ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లు ఉండడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి ఆరుబయటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ప్రాథమిక అంచనాలను బట్టి ఈ భూకంపం కారణంగా చెప్పలేనంత నష్టం సంభవించినట్లు తెలుస్తోందని ప్రభుత్వ ముఖ్య ప్రతినిధి యుకియో ఎడనో చెప్పారు. సహాయ చర్యలకోసం ఎనిమిది సైనిక విమానాలను, 500 మంది సైనికులను రంగంలోకి దింపిన ప్రభుత్వం శక్తికి మించి పని చేయాలని వారిని ఆదేశించింది. జపాన్ మంత్రివర్గం సమావేశమై పరిస్థితిని సమీక్షించడంతో పాటు మరిన్ని సునామీలు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కలసిమెలసి పని చేయాలని అధికార, ప్రతిపక్షాల నాయకులు నిర్ణయించారు.
దానికి సంబందించిన వీడియోలు :
0 comments:
Post a Comment